ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జడ్పీ చైర్మన్ ఎన్నికలో టిడిపి హావా
కొనసాగించింది. పది జడ్పీ చైర్మన్ స్థానాలను ఎగురేసుకపోయింది. తుది ఫలితాలు
వెలువడే సరికి వైసిపి ఒక్క జిల్లాతో, కాంఎగ్రస్ పత్తా లేకుండా పోయింది.
టిడిపి జోరు..
సార్వత్రిక ఎన్నికల్లో మొదలైన టిడిపి జోరు స్థానిక ఎన్నికల్లో
కొనసాగించింది. ఎంపిటిసి ఎన్నికలోనూ అత్యధిక అధ్యక్ష పీఠాలను కైవసం
చేసుకున్న టిడిపి జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఎదురులేకుండా పోయింది. కడప
జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జగన్ పార్టీ సొంతం చేసుకుంది. గూడురు రవి
చైర్మన్ గా ఎన్నిక కాగా జె.సుబ్బారెడ్డి వైస్ చైర్మన్ గా గెలుపొందారు.
చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఒక్క జడ్పీని సైతం
దక్కించుకోలేక పోయింది.
జడ్పీ చైర్మన్ లు వీరే...
ఉత్తరాంధ్రలో సత్తా చాటుతున్న టిడిపి జడ్పీ చైర్మన్ ఎన్నికల్లోనూ
ప్రాబల్యాన్ని చాటుకుంది. శ్రీకాకుళం జడ్పీ చైర్మన్‌గా చౌదరి ధనలక్ష్మి,
విజయనగరం జడ్పీ చైర్మన్‌గా శోభాస్వాతి రాణి, విశాఖపట్నం చైర్మన్‌గా లాలం
భవాని ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జడ్పీ చైర్మన్‌గా నామన రాంబాబు,
పశ్చిమగోదావరి చైర్మన్‌గా ముళ్లపూడి బాపిరాజు, కృష్ణా జిల్లా చైర్మన్‌గా
గద్దె అనురాధ విజయం సాధించారు. గుంటూరు జిల్లా నుంచి షేక్ జానీమూన్,
చిత్తూరు జిల్లా నుంచి ఎస్.గీర్వాణి చైర్మన్లుగా గెలుపొందారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగిన భూమా..
కర్నూల్ జడ్పీటిసి ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి ఎక్కువ స్థానాలు సాధించినా
చివరకు చైర్మన్ పదవి మాత్రం టిడిపికే దక్కింది. ఒకానొక సమయంలో వైసిపి
ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు టిడిపికి
చెందిన రాజశేఖర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతపురం జడ్పీ చైర్మన్‌గా
టిడిపికి చెందిన దూదేకుల చమన్ గెలుపొందారు.
వాయిదా పడిన నెల్లూరు, ప్రకాశం జిల్లా..
చివరి వరకు నెల్లూరు, ప్రకాశం జడ్పీటిసి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగినా
ఫైనల్‌గా వాయిదా పడ్డాయి. ప్రకాశం జడ్పీ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత
ఏర్పడింది. టిడిపికి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై వైసిపికి
చెందిన అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ దాడి చేశారనే వార్తతో రగడ మొదలైంది.
టిడిపి కార్యకర్తలు హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు
అడ్డుకోవడంతో గొడవ జరిగింది. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో
ఎన్నికను వాయిదా వేశారు.